Social Icons

Friday, September 14, 2012

పూర్తిగా వాడదాం...


బుద్ధుడు ధర్మ ప్రచారం చేస్తూ దేశమంతటా తిరుగుతున్న రోజులవి. బుద్ధునికి ఆసరికే లెక్కలేనంతమంది శిష్యులు ఉన్నారు. ఊరూరా బౌద్ధ ఆరామాలు వెలిశాయి. ఆ ఆరామాలలో బౌద్ధసన్యాసులు నివసిస్తూ ఉండేవాళ్ళు. భోజనంకోసం ఊళ్లో భిక్షాటన చేసేవాళ్ళు. వాళ్ళ కనీస అవసరాలనుమాత్రం ఆరామాలు తీరుస్తుండేవి. బుద్ధుని సూత్రాలలో ఒకటి, పొదుపుగా జీవించటం: ఏ వస్తువునైనా సరేసరిగ్గా, పొదుపుగా, శ్రద్ధగా ఉపయోగించుకోవటం, దేనినీ పారెయ్యకుండా పూర్తిగా వాడుకోవటం ఆయన పెట్టుకున్న నియమాలలో ఒకటి.
 
ఒకనాడు బుద్ధుడు అలా ఒక ఊరిలోని ఆరామాన్ని సందర్శిస్తుండగా ఆయనకు ఒక వృద్ధ సన్యాసి ఎదురుపడ్డాడు.
“బాగా చలిగా ఉంటున్నది- ఇక్కడ చలికాలంలో ఎముకలు కొరికే చలి. పైన కప్పుకునేందుకు శాలువా లేక, కష్టంగా ఉన్నది. మీకు వీలైతే, నాకు ఒక కొత్త ఉన్ని శాలువా ఇప్పించండి” అని అడిగాడాయన.


బుద్ధుడు అతన్ని అడిగాడు -”నీ పాత శాలువా ఏమైంది?” అని.
 
“వాడగా-వాడగా అది పాతదైపోయి, చినిగి పోయింది. ఇప్పుడు నేను దానిని దుప్పటి లాగా వాడుకుంటున్నాను” అని సమాధానం ఇచ్చాడు సన్యాసి.
 
“కానీ అంతకు ముందే నీ పాత దుప్పటి ఒకటి ఉండి ఉండాలి గద, అది ఏమైపోయింది?” అడిగాడు బుద్ధుడు.
“గురువు గారూ! వాడగా, వాడగా ఆ దుప్పటి పాతది అయిపోయి, చినిగి పోయింది. అందుకని నేను ఇప్పుడు దాన్ని కత్తిరించి దిండు సంచిగా కుట్టుకొని వాడుకుంటున్నాను” చెప్పాడు సన్యాసి.
 
“బాగుంది. కానీ , ఈ కొత్త దిండు సంచి ముందు పాత దిండు సంచిఒకటి ఖచ్చితంగా ఉండి ఉంటుంది కదా! మరి ఆ పాత దిండు సంచి ఏం చేశావు?” అడిగాడు బుద్ధుడు.
 
“ఇన్నేళ్లలోనూ నా తల దాన్ని కొన్ని లక్షల సార్లు రుద్దుకొని రుద్దుకొని ఉంటుంది- అలా దానికి ఒక పెద్ద రంధ్రం పడింది. నేను ఇప్పుడు దాన్ని కాళ్ళు తుడుచుకునే పట్టాగా వాడుకుంటున్నాను” బదులిచ్చాడు సన్యాసి.
 
అయినా బుద్ధుడికి తృప్తి కలగలేదు. ఏ విషయాన్ని అయినా చాలా లోతుగా పరిశీలిస్తాడాయన- అందుకని, వెంటనే అడిగాడు- “మరి నువ్వు నీ పాత కాళ్ళు తుడుచుకునే పట్టా ను ఏం చేశావు?”
 
“గురువుగారూ, వాడగా-వాడగా నా పాత కాళ్ళు తుడుచుకునే పట్టా పూర్తిగా అరిగిపోయింది. దాని నిలువు పోగులు, అడ్డు పోగులు పూర్తిగా ఊడి వస్తున్నాయి. నేను ఆ నూలు పోగులను పేని, వత్తులు చేసుకున్నాను. ప్రతి రోజూ నూనె దీపంలోకి ఆ వత్తుల్నే వాడుకుంటున్నాను” అన్నాడు సన్యాసి.
 
బుద్ధుడు సంతోషించాడు. చిరునవ్వు నవ్వాడు. సన్యాసికి కొత్త శాలువా లభించింది.

సేకరణ : http://pravasarajyam.com/1/childrencorner/2012/06/07/use-completly-kid-story/