Social Icons

Tuesday, October 9, 2012

చిన్ననాటి ఆటలు - [Puli Joodam / పులి జూదం]

English | తెలుగు

పులి - మేక ఇది పట్టికతో ఆడేటటువంటి ఆట. ఈ ఆటను ఇద్దరు ఆటగాళ్ళు ఒకరు మూడు పులులతో మరొకరు 15 మేకలతో ఆడవలసివుంటుంది. పులులు మేకలను వేటాడితే మేకలు పులులను కట్టడి చేయవలసి వుంటుంది.

కావలసిన వస్తువులు:
- పట్టిక
- 3 పులులు(పావులు) 15 మేకలు(పావులు)  
- ఇద్దరు ఆటగాళ్ళు

ఆడవలసిన విదానం:
- ఈ ప్రక్కన ఉన్న ఫొటోలో మాదిరి పట్టికను నేలమీద కాని అట్ట మీద కాని గీయవలయును.
- ఒక పులిని కొండ పైన మిగిలిన రెండు పులులను కొండకు దగ్గరగా ఉన్నటువంటి X (రెండు గీతలు కలిసే చోట) లో పెట్టి ఆటను మొదలుపెట్టాలి.
- మేకలతో ఆడే ఆటగాడు మొదట మేకను పట్టికలోని కాలీగా ఉన్నటువంటి X లో పెట్టాలి.
- తరువాత పులులతో అడే ఆటగాడు తన పులులలో ఒకదానిని పక్కనేఉన్నటువంటి ఎదైనా కాలీగా ఉన్న X లోకి జరుపవలెను.
- ఇలా ఒకరి తరువాత ఒకరు పావులను జరుపుకుంటూ ఆటను కొనసాగించాలి.
- ఐతే పులి ప్రక్కన మేక దాని ప్రక్కన కాలి X ఉంటే పులి ఆ మేకను చంపుతుంది. ఇలా చంపబడిన మేకను పట్టికపైనుంచి తీసివేయవలయును.
- 15 మేకలు అట్టపైకి చేరేంతవరకు మేకలను జరుపుటకు వీలుపడదు.

రూల్స్ (పులులు):
- పులులు ఆటమొదలైన దగ్గరనుంచి ఎపుడైనాసరే మేకలను మింగవచ్చు.
- ఒక్కొక్కసారి ఒకే మేకను మింగవలసివుంటుంది.
- పులి మేకను ఎటువైపునుంచైనా దూకవచ్చు. ఐతే కాలిగా ఉండే X అదే గీతలో ఉండాలి.
- ఒక పులి ఇంకొక పులిని దూక కూడదు.

రూల్స్ (మేకలు):
- పులి మింగినపుడు ఆ మేకను పట్టికనుంచి తీసివేయాలి.
- మేకలు పులులపైనుంచిగాని మరి ఏ ఇతర మేకలపైనించిగాని దూకరాదు.
- 15 మేకలూ పట్టికమీదకు వచ్చినతరువాతనే మేకలను జరుపవలసివుంటుంది.

గెలుపు:
- పులులు అన్ని మేకలను చంపగలిగితే పులులు గెలిచినట్లు.
- మేకలు పులులను కదలకుండా కట్టడిచేయగలిగితే మేకలు గెలిచినట్లు.