Social Icons

Tuesday, November 20, 2012

చిన్ననాటి ఆటలు - [Seven Stones / ఏడు పెంకులాట]

English | తెలుగు

ఈ ఆటలో రెండు జట్లు ఉంటాయి. ఒక్కొక్క జట్టులో దాదాపు అయిదు మంది సభ్యులు ఉంటారు. ఆట ముందుగా నిర్ణయించుకొన్న సరిహద్దులలో జరుగుతుంది. ఈ ఆటకు కావలసిన ముఖ్య వస్తువులు: ఏడు పెంకులు, ఒక బంతి..!! ఈ ఆట ప్రారంభంలో ఏడు పెంకులు మైదానం మధ్యలో ఒకదానిపై మరొకటి పేర్చి ఉంచుతారు. ఈ పెంకులకు అటూ ఇటూ అయిదారు అడుగుల దూరంలో గీతలు ఉంటాయి.

ఆట ఏ జట్టు మొదలు పెట్టాలో నిర్ణయించడానికి “టాస్” వేస్తారు. ఒక పెంకు ముక్క తీసుకొని, దానికి ఒకవైపు ఉమ్మి రాసి, గాలిలోకి ఎగురవేయాలి. ఇరు జట్ల నాయకులూ “తడి” లేదా “పొడి” లో ఒక దాన్ని ఎన్నుకొంటారు. పెంకు ఏవైపుగా తిరగబడిందన్న దాన్ని బట్టి టాస్ ను నిర్ణయిస్తారు.

టాస్ గెలిచిన జట్టు సభ్యుడొకడు గురిచూసి పెంకుల వైపు బంతిని విసురుతాడు. ఆ సమయంలో అతని కాలు, అతని వైపు ఉన్న గీతను దాటకూడదు. ఈ విసిరిన బంతిని అవతలి జట్టు సభ్యులు క్యాచ్ చేయటానికి ప్రయత్నిస్తారు. క్యాచ్ పట్టుకొంటే మొదటి జట్టు బంతి విసిరే అవకాశాన్ని కోల్పోతుంది. లేకుంటే, మొదటి జట్టుకే మరల బంతిని విసిరే అవకాశం వస్తుంది. ఒక జట్టు మూడుసార్ల కన్న ఎక్కువ అవకాశాలను పొందలేదు. ఒకవేళ, బంతి విసిరిన వ్యక్తి పెంకులను పడకొట్టగలిగితే అసలు ఆట ప్రారంభం అవుతుంది..!!

పెంకులను పడకొట్టిన జట్టు సభ్యులు మరల పెంకులను యధాస్థానంలో ఒకదానిపై మరొకటి నిలబెట్టవలసి ఉంటుంది. అదే సమయంలో, రెండవ జట్టు సభ్యులు, బంతిని వెతికి పట్టుకొని, మొదటి జట్టు సభ్యులలో ఎవరినైనా బంతితో కొట్టగలగాలి. మొదటి జట్టు సభ్యులు పెంకులను నిలబెట్టగలిగేలోగా ఇది జరగాలి. పెంకులను నిలబెట్టగలిగితే మొదటి జట్టుకు పాయింటు, ప్రత్యర్థి జట్టు సభ్యుడిని బంతితో కొట్టగలిగితే రెండవ జట్టుకు పాయింటు. ఆట ముగిసే సమయానికి ఏ జట్టు ఎక్కువ పాయింట్లను గెలుచుకొంటుందో వారే విజేత.

పెంకులను పడగొట్టగానే, ఆ జట్టువారందరూ నలుమూలలకూ పరిగెడతారు. అదే పొరపాటున ఒకే వైపుకు పరిగెడితే అవతలి జట్టుకే విజయం సాధించే అవకాశం ఎక్కువ. అదే విధంగా బంతిని వేటాడే జట్టువారు సాధ్యమైనంతగా బంతిని మైదానం మధ్యనే ఉండేట్టు చూసుకొంటారు. లేదా, బంతిని వెతికి పట్టుకొనే లోపు, మొదటి జట్టువారు పెంకులను నిలబెట్టే అవకాశం మెండు.

ప్రత్యర్థులను ఏమార్చడం, వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడం ఈ ఆటలో ఇమిడి ఉంటాయి. పెంకులను ఒకదానిపై ఒకటి పేర్చగలిగితే, దానికి సంకేతంగా చప్పట్లు కొట్టవలసి ఉంటుంది. అప్పటి దాకా ఎంతో టెన్షన్‌తో సాగిన ఆట ఆ చప్పట్లతో ముగుస్తుంది.