ఒకానొక రోజున ఒక ఋషిపుంగవుడు తన శిష్యగణంతో పవిత్ర గంగానదియందు స్నానమాచరించుటకు బయలుదేరి
వెళ్ళుచుండగా పవిత్ర నదీతీరమున గొడవపడుచు అరచుకుంటున్న భార్యభర్తలను చూసి తన శిష్యులతో
“నాయనలారా! మనష్యులు కోపమునందు ఒకరి యెడల మరియొకరు ఎందుకు అరుచుకుందురు?” అని అడిగెను.
శిష్యులందరు కొంతసేపు ఆలోచించిన తరువాత ఒకడు “అయ్యా మనం కోపమునందు ప్రశాంతతనుకోల్పోవుదుము, అందువలన అరిచెదము” అని చెప్పెను. అప్పుడు ఆ ఋషి “కాని నీవు ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఎందుకు బిగ్గరగా అరిచెదవు? నువ్వు ఆ విషయమును సౌమ్యముగా కూడా తెలుపవచ్చునుకదా?” అని ప్రశ్నించెను. శిష్యులు కొన్ని సమాధానములు చెప్పినప్పటికి అవి మిగిలినవారిని సంతృప్తి పరచలేదు. చివరకు ఋషిపుంగవుడు ఈ విదముగా వివరించెను “ఇద్దరు మనుషులు ఒకరియందు మరొకరు కోపముగా ఉన్నప్పుడు వారి హృదయాల మద్య దూరం పెరుగును. ఆ దూరమును అదిగమించి ఒకరి మాటలు మరొకరిని చేరాలంటే గట్టిగా అరిచి చెప్పవలిసివచ్చును. ఎంత కోపముగా ఉంటే అంత దూరం పెరుగును, ఆ దూరమును అదిగమించుటకు అంతే గట్టిగా అరవాల్సి వచ్చును. ఒకరిపట్ల మరొకరు ప్రేమాభిమానములు కలిగి ఉన్నప్పుడు ఏమి జరుగును? వారి హృదయాల మద్య దూరం లేకుండును ఉన్నను చాలా తక్కువగా ఉండును. అందువలన ఒకరితో ఒకరు సౌమ్యముగా మాట్లడుదురుగాని అరువరు. వారు అమితమైన ప్రేమాభిమానములు కలిగి ఉనప్పుడు ఏమి జరుగును? వారు మాట్లాడరు, కేవలం గుసగుసలాడుచు వారి ప్రేమలో మరింత దగ్గరవుదురు. చివరకు వారు గుసగుసలాడవలిసిన అవసరం కూడా ఉండదు, వారు ఒకరితో ఒకరు కన్నులతోనే మాట్లాడుకుందురు.” ఋషిపుంగవుడు తన శిష్యులతో ఇటులనెను “మీరు వాదించు సమయమున మీ హృదయముల మద్య దూరం పెరుగకుండా చూసుకొనుము లేనియెడల ఒకానొక దినమున మీకు ఆ దూరమును తగ్గించు మార్గమే తెలియకుండును.” |