Social Icons

Showing posts with label చిన్ననాటి ఆటలు. Show all posts
Showing posts with label చిన్ననాటి ఆటలు. Show all posts

Tuesday, October 9, 2012

చిన్ననాటి ఆటలు - [Puli Joodam / పులి జూదం]

English | తెలుగు

పులి - మేక ఇది పట్టికతో ఆడేటటువంటి ఆట. ఈ ఆటను ఇద్దరు ఆటగాళ్ళు ఒకరు మూడు పులులతో మరొకరు 15 మేకలతో ఆడవలసివుంటుంది. పులులు మేకలను వేటాడితే మేకలు పులులను కట్టడి చేయవలసి వుంటుంది.

కావలసిన వస్తువులు:
- పట్టిక
- 3 పులులు(పావులు) 15 మేకలు(పావులు)  
- ఇద్దరు ఆటగాళ్ళు

ఆడవలసిన విదానం:
- ఈ ప్రక్కన ఉన్న ఫొటోలో మాదిరి పట్టికను నేలమీద కాని అట్ట మీద కాని గీయవలయును.
- ఒక పులిని కొండ పైన మిగిలిన రెండు పులులను కొండకు దగ్గరగా ఉన్నటువంటి X (రెండు గీతలు కలిసే చోట) లో పెట్టి ఆటను మొదలుపెట్టాలి.
- మేకలతో ఆడే ఆటగాడు మొదట మేకను పట్టికలోని కాలీగా ఉన్నటువంటి X లో పెట్టాలి.
- తరువాత పులులతో అడే ఆటగాడు తన పులులలో ఒకదానిని పక్కనేఉన్నటువంటి ఎదైనా కాలీగా ఉన్న X లోకి జరుపవలెను.
- ఇలా ఒకరి తరువాత ఒకరు పావులను జరుపుకుంటూ ఆటను కొనసాగించాలి.
- ఐతే పులి ప్రక్కన మేక దాని ప్రక్కన కాలి X ఉంటే పులి ఆ మేకను చంపుతుంది. ఇలా చంపబడిన మేకను పట్టికపైనుంచి తీసివేయవలయును.
- 15 మేకలు అట్టపైకి చేరేంతవరకు మేకలను జరుపుటకు వీలుపడదు.

రూల్స్ (పులులు):
- పులులు ఆటమొదలైన దగ్గరనుంచి ఎపుడైనాసరే మేకలను మింగవచ్చు.
- ఒక్కొక్కసారి ఒకే మేకను మింగవలసివుంటుంది.
- పులి మేకను ఎటువైపునుంచైనా దూకవచ్చు. ఐతే కాలిగా ఉండే X అదే గీతలో ఉండాలి.
- ఒక పులి ఇంకొక పులిని దూక కూడదు.

రూల్స్ (మేకలు):
- పులి మింగినపుడు ఆ మేకను పట్టికనుంచి తీసివేయాలి.
- మేకలు పులులపైనుంచిగాని మరి ఏ ఇతర మేకలపైనించిగాని దూకరాదు.
- 15 మేకలూ పట్టికమీదకు వచ్చినతరువాతనే మేకలను జరుపవలసివుంటుంది.

గెలుపు:
- పులులు అన్ని మేకలను చంపగలిగితే పులులు గెలిచినట్లు.
- మేకలు పులులను కదలకుండా కట్టడిచేయగలిగితే మేకలు గెలిచినట్లు.


Read More

Monday, September 24, 2012

చిన్ననాటి ఆటలు - [Bachaala AaTa / బచ్చాలాట]


English | తెలుగు

ఈ ఆటకు కావలసిన వస్తువులు పాత సిగరెట్ పెట్టెలయొక్క ఉపరితల కాగితములు మరియు లొపల ఉండే కాగితములు. ప్రతి కాగితమునకు కొంత విలువ ఉంటుంది. ఉదాహరణకు గొల్ద్ ఫ్లేక్ సిగరెట్టు పెట్టె ఉపరితల కాగితపు విలువ 5. అలాగె ఏ రకమైన సిగరెట్టు పెట్టెయందలి లోపలి కాగితపు విలువ 1 గా లెక్కిస్తారు.

ఆటగాళ్ళు ఒక వృత్తాకారపు() గీత గీసి దాని మద్యలో ఈ కాగితాలని ఒకదాని పైన ఒకటి పేరుస్తారు. ఇలా పేర్చిన తరువాత వీటిని బచ్చాలతో గీత బయటవుండి కొట్టాలి. అలా కొట్టినప్పుడు ఎన్ని కాగితాలు గిరి బయటకు వస్తాయో అవి ఆటగాడికి చెందుతాయి.

అయితే ఈ ఆటను ముందు ఎవరు ఆడాలి అనేది నిర్ణయించటానికి అందరు వారి వారి బచ్చాలను గిరి దగ్గరనుంచి దూరంగా విసురుతారు. అలా విసిరినప్పుడు ఎవరి బచ్చా ఎక్కువ దూరం వెలుతుందో ఆ ఆటగాడు ఆటను మొదలు పెడతాడు. ఐతె అతను అతని బచ్చా ఎక్కడ పడిందో అక్కడినుంచే మొదలు పెట్టవలసి ఉంటుంది. ఈ విదంగా మొదలై చివరగా ఏ ఆటగాడైతే గిరికి దగ్గరగా విసురుతాడో అతనితో ముగుస్తుంది.

ఈ ఆటలో ఎవరికి ఎక్కువ విలువ కలిగిన కాగితములు వస్తాయో వారు గెలిచినట్లు లెక్క.


Read More

Wednesday, August 29, 2012

చిన్ననాటి ఆటలు - [AshTa Chamma / అష్టా-చెమ్మ]


English | తెలుగు

"అష్టా-చెమ్మ" దీనినే "గవ్వలాట" అనికూడా అంటారు.

ఈ ఆట ఆడడానికి కావలసిన ముఖ్యవస్తువులు: 5 అడ్డు వరుసలు, 5 నిలువు వరుసలతో కూడి చతురస్రాకారంలో ఉన్న పటం. నప్పులు, గవ్వలు. [నప్పు ని కొన్ని ప్రాంతాలలో పావులు అని అంటారు]. "నప్పు" ఒక ఆటగాడియొక్క చిహ్నం. ఈ ఆటలో పాల్గొనే ప్రతీ ఆటగాడికీ వేరే వేరే ఆకారాలు లేదా రంగులున్న నప్పులు ఉంటాయి. ఇక ఈ నప్పులను ఎంత దూరం నడపాలో నిర్ణయించడానికి కావలసినవి గవ్వలు. సాధారణంగా నాలుగు ఒకే పరిమాణం గల గవ్వలను ఆటకు ఉపయోగిస్తారు. ఈ గవ్వలను ఆటగాడు విసిరినప్పుడు ఎన్ని గవ్వలు వెల్లకిల పడితే నప్పు అంత దూరం జరపవలసి ఉంటుంది. నాలుగు గవ్వలూ వెల్లకిల పడితే "చెమ్మ" అనీ, నాలుగూ బోర్లా పడితే "అష్ట" అనీ అంటారు. "చెమ్మ" అంటే నాలుగు, "అష్ట" అంటే ఎనిమిది. ఇవి పడినప్పుడు ఆ ఆటగాడికి మరల గవ్వలు విసిరే అవకాశం ఉంటుంది. కానీ అదే, మూడు సార్లు అష్ట లేదా చెమ్మ పడితే, నప్పును జరిపే అవకాశాన్ని కోల్పోతాడు.

గవ్వలు
3 వెల్లకిలా, 1 బొర్లా పడితే - నప్పును ఒక గడి జరపవచ్చును లేదా ఒక నప్పును ఆటలోనికి ఎక్కించవచ్చును.
2 వెల్లకిలా, 2 బోర్లా పడితే - నప్పును రెండు గడులు జరపవచ్చును
1 వెల్లకిలా, 3 బోర్లా పడితే - నప్పును మూడు గడులు జరపవచ్చును
4 వెల్లకిలా(చమ్మ) పడితే - నప్పును నాలుగు గడులు జరపవచ్చును లేదా రెండు నప్పులను ఆటలోనికి ఎక్కించవచ్చును.
4 బోర్లా(అష్ట) పడితే - నప్పును ఎనిమిది గడులు జరపవచ్చును లేదా నాలుగు నప్పులను ఆటలోనికి ఎక్కించవచ్చును.

ఈ ఆటలో ఇద్దరు నుంచి నలుగురు ఆటగాళ్ళు, పటానికి నాలుగు వైపులా కూర్చొని ఆడతారు. ప్రతీ ఆటగాడికీ, తనవైపుగా బయట వరుసలో ఉన్న 5 గళ్ళలో, మధ్య గడిలో "X" గుర్తు వేసి ఉంటుంది. ఇది ఆ ఆటగాడి "ఇల్లు" అంటారు. ఈ గడే కాక, పటంలో లోపలగా మధ్యలో ఉన్న గడిలోనూ, మరి కొన్ని గళ్ళలోనూ "X" గుర్తు వేసి ఉంటుంది. వీటిని విరామ స్థానాలు అనవచ్చు. ప్రతీ ఆటగాడూ, తన నాలుగు నప్పులనూ బయటి గడులలో అపసవ్య(anti clockwise) దిశ లోను, లొపటి గడులలో సవ్య(clockwise) దిశ లోనూ నడుపుకొంటూ, చివరకు మధ్యలో "X" గుర్తు ఉన్న గడికి చేర్చవలసి ఉంటుంది.

ఏ ఆటగాడి నప్పులు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకొంటే అతడే విజేత. ఆటగాడు తన నాలుగు నప్పుల్లో దేనిని జరుపుతాడు అనేది అతని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారికి ఒక నప్పునే జరుపవలసి ఉంటుంది. ఈ ఆటలో నియమాలు ఇవే అయితే మజా ఏముంటుంది..? అసలు మజా అల్లా ఒక ఆటగాడి నప్పులను మరొకరు చంపుకోవడంలో ఉంటుంది. ఒక ఆటగాడి నప్పు "X" గుర్తు లేని గడిలో ఉన్నప్పుడు, రెండవ ఆటగాడి నప్పు అదే గడిలోకి వచ్చి చేరితే, రెండవ ఆటగాడి నప్పు, మొదటి ఆటగాడి నప్పును చంపినట్టు లెక్క. అప్పుడు మొదటి ఆటగాడి ఆ నప్పు, అతని ఇంటికి చేరుతుంది..!! ఆ నప్పును అతడు మరల మొదటినుంచే నడుపుకు రావలసి ఉంటుంది. "X" గుర్తు గడిలో ఉన్న నప్పును ఏ నప్పూ చంపలేదు. ఇలా ఒకరి నప్పులు ఒకరు చంపుకొంటూ, కసితో, ఉత్సాహంతో, రసవత్తరంగా సాగుతుంది ఈ ఆట.


Read More

Sunday, August 19, 2012

చిన్ననాటి ఆటలు - అచ్చెనగండ్లు [Acchena Gandlu]

English | తెలుగు
అచ్చెనగండ్లు ఆడపిల్లలకు చాలా ఇష్టమైన ఆట. ఈ ఆట ఆడటానికి కావలసినవి ఐదు చిన్న చిన్న రాళ్ళు లేదంటే కుంకుడు/చింత గింజలు. ఈ ఆటయెక్క మూలాలు కొరియా లో ఉన్నట్లు చెపుతారు.

ఈ ఆట ఆడే వ్యక్తి ఒకే చేతిని ఉపయోగించవలసి ఉంటుంది.

మొదటి అంకం:
ఆట ఆడే వ్యక్తి రాళ్ళను నేలపై పరచి ఒక రాయిని తీసుకొని గాలిలోకి ఎగురవేయాలి. ఆ రాయి తిరిగి నేలకు తాకేలోపుగా కింద పరచివున్న రాళ్ళలో ఒకదానిని ఒడిసిపట్టుకొని గుప్పెట్లోకి తీసుకోవాలి. ఇలా గుప్పెట్లోకి తీసుకొనేటప్పుడు పక్కగా ఉన్న ఏ ఇతర రాయి కదలకూడదు. అదే సమయంలో పైనున్న రాయి నేలకు తాకకుండా అదె గుప్పెటతో మరల అందుకోవాలి. అదే విదంగా మిగిలిన రాళ్ళు అన్ని ఒక్కొక్కటి తీసుకోవాలి. పైకి ఎగురవేసిన రాయి నేలకు తాకినా, లేక కిందనున్న ఏ ఇతర రాళ్ళు కదలినా ఆ వ్యక్తికి ఆట కొనసాగించే అవకాశం పోతుంది.

రెండవ అంకం:
ఇందులో కూడా మొదటి అంకంలో మాదిరి గానే రాళ్ళను నేలపై పరచి ఒక రాయిని తీసుకొని పైకి ఎగురవేసి కింద పరచివున్న రాళ్ళలో రెండింటిని వడిసిపట్టాలి. అదే విదంగా మిగిలిన రాళ్ళు అన్ని రెండేసి తీసుకోవాలి.

మూడవ మరియు నాల్గవ అంకం:
అలాగే మూడవ అంకంలో మూడేసి రాళ్ళను నాల్గవ అంకంలో నాలుగేసి రాళ్ళను వడిసిపట్టాలి.

ఐదవ అంకం: 
ఈ అంకంలో ఆటగాళ్ళకు పాయింట్లు వస్తాయి. మొత్తం ఐదు రాళ్ళను పైకి ఎగురవేసి అవి కిందపడేలోపు అరచేతిని వెనుకకుతిప్పి ఎన్ని రాళ్ళను వడిసిపట్టగలరో అన్ని పట్టాలి. తరువాత మరలా వాటిని పైకి ఎవురవేచి ఈసారి అరచేతితో మొత్తం అన్ని రాళ్ళను వడిసిపట్టాలి. ఇలా ఎన్ని రాళ్ళూ పట్టగలిగారో వారికి అన్ని పాయింట్లు వచ్చినట్లు లెక్క.

ఈ విధంగా ఆట ఒకరినుంచి ఇంకొకరికి మారుతూ కొనసాగుతుంది. చివరగా ఏ వ్యక్తికి పాయింట్లు ఎక్కువ వస్తాయో ఆవ్యక్తి గెలిచినట్లన్నమాట.


Read More